ఆగస్టు 2018 అంతర్జాతీయం

జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్ విజయం

జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్ మునంగాగ్వా (75) విజయం సాధించారు. 50.8 శాతం ఓట్లు సాధించి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తంగా అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్-పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను-పీఎఫ్) పార్టీకి 144 స్థానాలు, మూవ్‌మెంట్ ఫర్ డెమోక్రటిక్ చేంజ్ (ఎండీసీ) కూటమికి 64 స్థానాలు, నేషనల్ పాట్రియాటిక్ ఫ్రంట్‌కు ఒక స్థానం లభించాయి. జింబాబ్వేను 37 ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించిన రాబర్ట్ ముగాబేను 2017 నవంబర్‌లో పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ దేశంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే.


ఇరాన్ పై అమెరికా ఆంక్షలు

అణు ఒప్పందాన్ని అనుసరించి ఇరాన్‌పై అమెరికా 2015లో ఎత్తేసిన ఆంక్షలను తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఇరాన్-అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్ 2018 మే నెలలో రద్దు చేశారు. మరింత సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆంక్షలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.