జూలై 2018 అంతర్జాతీయం

పాకిస్థాన్ ఎన్నికలు - 2018

పాకిస్థాన్‌లో జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం జూలై 28న విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్థాన్ తెహ్రీకీ ఇన్సాఫ్’ (పీటీఐ) 115 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధాని షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ పీఎంఎల్(ఎన్) పార్టీ 64 సీట్లు గెలుపొందగా, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 43 సీట్లను గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 13 స్థానాలు గెలుపొందారు. పాకిస్తాన్ పార్లమెంటు దిగువ సభలో మొత్తం 342 సీట్లు ఉండగా అందులో 272 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. తాజాగా 270 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 172 సీట్లు ఉండాలి.అక్కడి చట్టాల ప్రకారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ప్రభుత్వం ఏర్పాటుకు 21 రోజుల సమయం ఇస్తారు. మరోైవె పు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అదనంగా గెలుచుకున్న స్థానాలకు రాజీనామా చేయాలి. దీంతో ఐదు నియోజకవర్గాల్లో గెలుపొందిన పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నాలుగు సీట్లకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. తొలి హిందూ ఎంపీ పాకిస్థాన్‌లో తొలిసారిగా ఒక హిందువు ఎంపీగా గెలిచాడు. పీపీపీ తరపున సింధ్ ప్రావిన్స్లోని థార్‌పార్కర్-2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్ కుమార్ మలానీ 20 వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్‌లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్.. 2003-08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా ఉన్నారు.


హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ సదస్సు

వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు 2019 అక్టోబర్‌లో నిర్వహించే ఈ సదుస్సుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) జూలై 24న వెల్లడించింది. ‘హ్యూమనైజింగ్ డిజైన్’ అనే ఇతివృత్తంతో 5 రోజులపాటు నిర్వహించే ఈ సదస్సుకు ఇండియా డిజైన్ ఫోరం(ఐడీఎఫ్) భాగస్వామ్యం వహించనుంది. మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో వస్తు నమూనాల ప్రాముఖ్యం వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. డబ్ల్యూడీఓ ఇండస్ట్రియల్ డిజైన్ రంగంలో 60 ఏళ్లుగా కృషి చేస్తుంది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనలో పారిశ్రామిక డిజైన్ల రూపకల్పన కీలకమని నిరూపించడానికి అవసరమైన వనరులు, అవకాశాలను హైదరాబాద్ కలిగి ఉన్నందున నగరాన్ని సదస్సుకు ఎంపిక చేశామని డబ్ల్యూడీఓ అధ్యక్షురాలు లూసా బొచ్చిట్టో తెలిపారు.


అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్‌గా హాంకాంగ్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్ (ప్రైమ్ ఆఫీస్ మార్కెట్)గా హాంకాంగ్ నిలిచింది. హాంకాంగ్ సెంట్రల్‌లో చదరపు అడుగు కు వార్షిక అద్దె రూ.21,067 గా ఉంది. హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్ (రూ.16,149), బీజింగ్‌లోని ఫైనాన్స్ స్ట్రీట్ (రూ.13,806), హాంకాంగ్‌లోని కౌవ్‌లూన్ (రూ.13,026), చైనాలోని సీబీడీ (రూ.13,018), న్యూయార్క్‌లోని మన్‌హటన్ (రూ.12,629), మిడ్‌టౌన్ (రూ.11,789), టోక్యోలోని మరూంచీ (రూ.11,784) ప్రాంతాలు నిలిచాయి. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన సీబీఆర్‌ఈ నివేదిక జూలై 11న విడుదలైంది. ఈ జాబితాలో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ (రూ.10,532) 9వ స్థానంలో నిలవగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) (రూ.6,632) 26, ముంబైలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) (రూ.5,002) లు 37వ స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 120 నగరాల్లో ఆక్యుపెన్సీ స్థాయి, ధరలపై ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ సర్వే చేసింది. గత ఏడాది కాలంలో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఆక్యుపెన్సీ వ్యయ వృద్ధి అన్ని రీజియన్లలోనూ స్థిరంగా ఉందని నివేదికలో తేలింది. అద్దెలు, పన్నులు, సర్వీస్ చార్జీలు ఇతరత్రా ఆఫీస్ వ్యయాలను కలిపిన ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ఏటా 2.4 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది.