అమెరికా పాలనా యంత్రాంగ నిర్వహణకు అవసరమైన ఖర్చులను నిర్దేశించే ‘వినిమయ బిల్లు’ను సెనెట్ తిరస్కరించటంతో అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చే ఈ బిల్లు జనవరి 19న సెనేట్‌లో 50-48 తేడాతో వీగిపోయింది. దీంతో పెంటగాన్, ఇతర కేంద్ర సంస్థలు పనిచేసేందుకు అవసరమైన నిధులు తాత్కాలికంగా ఆగిపోతాయి. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండానే సెలవులో ఉంటారు. వైద్యం, పోలీసు వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. గతంలో 2013 అక్టోబర్‌లో 16 రోజులు, 1996లో 21 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది.
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు
స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లోని విడిది కేంద్రం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు జనవరి 23న ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంతో డబ్ల్యూఈఎఫ్ ప్రారంభ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ ‘విరోధాలు, విభేదాలు లేని.. సహకారంతో కూడిన స్వేచ్ఛాయుత స్వర్గాన్ని కలిసికట్టుగా నిర్మించాలి’ అని ప్రపంచ దేశాలకు సూచించారు. 1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు.
డిఫాల్టర్లపై చైనా కఠిన చర్యలు
ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికే భారత్‌లో నానా కష్టాలు పడుతుంటే చైనా ప్రభుత్వం అక్కడి డిఫాల్టర్లకు చుక్కలు చూపిస్తోంది. 2017 చివరినాటికి రుణాల ఎగవేతకు పాల్పడిన 95.9 లక్షల మంది ప్రజల్ని కోర్టులు నిషేధిత జాబితాలో చేర్చినట్లు సుప్రీం పీపుల్స్ కోర్టు(ఎస్పీసీ) తెలిపింది. డిఫాల్టర్ల రూ.1.76 లక్షల కోట్ల(27.7 బిలియన్ డాలర్లు) డిపాజిట్లను జప్తు చేశారు. పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డుల ఆధారంగా విమానాలు, హైస్పీడ్ రైళ్లలో టికెట్లు కొనకుండా అడ్డుకున్నారు. డిఫాల్టర్లు దాఖలు చేసే రుణ, క్రెడిట్ కార్డ్ దరఖాస్తుల్ని తిరస్కరించేందుకు బ్యాంకులతో కలిసి పనిచేశారు. నిషేధిత జాబితా లోని వ్యక్తులు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులుగా ఇకపై ఉండలేరు.
పాక్‌కు మిలటరీ సాయం నిలిపివేస్తామని అమెరికా ప్రకటన
ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతో పాటు మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్ల్లు ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది.
అమెరికా-మెక్సికో గోడకు 1.14 లక్షల కోట్లు
మెక్సికో సరిహద్దులో గోడనిర్మించడానికి వచ్చే పదేళ్ల కాలానికి సుమారు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. సరిహద్దు రక్షణకు మొత్తం సుమారు రూ.2.09 లక్షల కోట్లు అవసరమని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక అంచనా పత్రాన్ని విడుదల చేసింది. అందులో గోడ నిర్మాణానికి రూ.1.14 లక్షల కోట్లు, సాంకేతిక పరికరాలకు సుమారు 36 వేల కోట్లు, రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితరాలకు సుమారు రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతిపాదించారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది.
సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్
ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సరం రోజున.. పెట్రోల్ ధరల్ని 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా.
ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్లు జైలు
న్యాయ వ్యవస్థను దూషించినందుకు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం డిసెంబర్ 30న మూడేళ్ల జైలుశిక్షతోపాటు 20 లక్షల పౌండ్ల జరిమానా విధించింది.
లైబీరియా కొత్త అధ్యక్షుడిగా జార్జ్ వేహ్
లైబీరియాలో జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా జార్జ్ వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డ్ డిసెంబర్ 29న ప్రకటించింది. ఆయన జనవరి 22న అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.