ఫిబ్రవరి 2018 అంతర్జాతీయం

డ్రైవర్‌లెస్ కార్లకు కాలిఫోర్నియా అనుమతి:-

అమెరికాలోని కాలిఫోర్నియా నగరం డ్రైవర్ రహిత కార్లను నగర రోడ్లపై పరీక్షించేందుకు అనుమతిని ఇచ్చింది. ఇందుకు సంబంధించి వాహన నియమావళిని కూడా సవరించింది. ప్రస్తుతం డ్రైవర్ రహిత కార్లను రోడ్లపైకి తెచ్చేందుకు టెల్సా, వైమో సంస్థలు పోటీ పడుతున్నాయి. కాగా ఇప్పటిదాకా వీటిని పరీక్షించేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ ముందు జాగ్రత్తగా డ్రైవర్‌ను అందుబాటులో ఉంచి, పరీక్షించారు. తొలిసారి పూర్తిగా వాహనంలో ఎవరూ లేకుండానే పరీక్షించేందుకు కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది.


సౌదీ సైన్యంలోకి మహిళలు:-

సౌదీఅరేబియా మహిళలను సైన్యంలోకి అనుమతిస్తూ ఫిబ్రవరి 26న చారిత్రక ప్రకటన చేసింది. మహిళా సాధికారతను పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.


దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 9 ఏళ్ల జుమా పాలనకు తెరపడింది. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ), జుమాకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. ఆయన రాజీనామా చేయకపోతే ప్రతిపక్ష పార్టీలతో కలసి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి జుమాను గద్దె దించాలని అధికార పార్టీ భావించింది. జాకబ్ జుమా రాజీనామా నేపథ్యంలో దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 15న జరిగిన పార్లమెంటు సమావేశంలో ఆయన ఎన్నికైనట్లు ప్రకటన వెలువడింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 65 ఏళ్ల రామాఫోసా రెండు నెలల కిందటే ఎన్నికయ్యారు.


నేపాల్ ప్రధానిగా ఓలీ ప్రమాణ స్వీకారం

హిమాలయ దేశమైన నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఫిబ్రవరి 15న ప్రమాణ స్వీకారం చేశారు. మహరాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లో అధ్యక్షురాలు బిద్యా దేవీ.. ఓలీ చేత ప్రమాణం చేయించారు. ఓలీ ఇంతకుముందు 2015 అక్టోబర్ నుంచి 2016, ఆగస్టు 3 వరకూ నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓలీకి చెందిన సీపీఎన్-యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ 174 సీట్లు గెలిచింది.


యూనిసెఫ్ ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ నివేదిక

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టినవెంటనే చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. నెల రోజుల్లోపు వయసున్న చిన్నారులు ప్రతి ఏటా 26 లక్షల మంది కన్నుమూస్తున్నారని వెల్లడించింది. ఈ మేరకు ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి అనుబంధంగా 184 దేశాల్లో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి యూనిసెఫ్ నివేదికను ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే పేద దేశాల్లో పుట్టే చిన్నారులు చనిపోయే అవకాశం 50 రెట్లు ఎక్కువని పేర్కొంది. ఈ మరణాలన్నీ మెరుగైన వైద్యంతో నివారించదగ్గవేనని యూనిసెఫ్ తెలిపింది. నవజాత శిశువుల మరణాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచిందనీ, అక్కడ పుట్టిన ప్రతి 22 మంది శిశువుల్లో ఒకరు చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాలకు సంబంధించి 52 దిగువ మధ్యతరగతి దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచినట్లు యూనిసెఫ్ తెలిపింది. నవజాత శిశువుల మరణాలు జపాన్‌లో(ప్రతి 1,111 మందిలో ఒకరు) అత్యల్పంగా నమోదైనట్లు పేర్కొంది.


క్రిప్టో సంపన్నుడు క్రిస్ లారెన్స్

ఫోర్బ్స్ తాజాగా తొలి క్రిప్టో కరెన్సీ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిపిల్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సెన్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన క్రిప్టో నికర విలువ 7.5-8 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 2017లో బిట్‌కాయిన్, ఇథీరియమ్, ఎక్స్‌ఆర్‌పీ అనే మూడు ప్రముఖ క్రిప్టోకరెన్సీల సగటు విలువలో మార్పు 14,409 శాతంగా ఉంది. దాదాపు 1,500 క్రిప్టో కరెన్సీలున్నాయి. వీటి సమష్టి విలువ 550 బిలియన్ డాలర్లు. 2017 ప్రారంభం నుంచి చూస్తే ఈ కరెన్సీల విలువ 31 శాతం మేర ఎగసింది. జోసెఫ్ లుబిన్ (క్రిప్టో నికర విలువ: 1-5 బిలియన్ డాలర్లు), చాంగ్‌పెంగ్ ఝావో (1-1.2 బిలియన్ డాలర్లు), కామెరాన్ అండ్ టైలెర్ వింక్‌లెవోస్ (900 మిలియన్- 1.1 బిలియన్ డాలర్లు), మాథ్యూ మెలాన్ (900 మిలియన్-1.1 బిలియన్ డాలర్లు) తదితరులు ఈ జాబితాలో స్థానం పొందారు. 2018 జనవరి 19 నాటి క్రిప్టో కరెన్సీల విలువ ఆధారంగా ఈ సంపన్నుల జాబితాలను రూపొందించారు. ఇందులో స్థానం దక్కించుకోవాలంటే కనీసం 350 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలను కలిగి ఉండాలి. భారత్‌లో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు.


మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం-కారణాలు

దక్షిణ ఆసియాలోని మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 5న పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కొన్ని గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో న్యాయమూర్తిని అరెస్టు చేయించింది. మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ కూడా నిర్బంధంలో ఉన్నారు. సంక్షోభానికి కారణం.. వివిధ కేసుల్లో మాజీ అధ్యక్షుడు మొహమద్ నషీద్ సహా పలువురు రాజకీయ నాయకులపై జరుగుతున్న విచారణ చెల్లదని సుప్రీంకోర్టు 2018 జనవరిలో ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న 9 మంది ప్రతిపక్ష ఎంపీల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. మొహమద్ నషీద్‌పై 2015లో చేపట్టిన విచారణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాల్ద్దీవుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడుగా గుర్తింపు పొందిన నషీద్ ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు. అయితే.. తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విడుదల చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో మాల్దీవుల్లో సంక్షోభం తలెత్తింది. ప్రతిపక్ష నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టారు. భారత్ సహాయాన్ని కోరిన నషీద్.. తమ దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు భారత్ తన సైన్యాన్ని పంపించి సాయం చేయాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కోరారు. మాల్దీవుల్లో అత్యవసర స్థితిని ప్రకటించడం సైనిక పాలనను ప్రవేశపెట్టడం వంటిదేనని.. ఇది రాజ్యాంగవిరుద్ధం, అక్రమమని ఆయన పేర్కొన్నారు. కాగా, మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో తాము కలత చెందామని భారత్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించడం ఆందోళనకరమంది. మాల్దీవులకు సాయం చేసే విషయంలో భారత్ నిర్దిష్ట కార్యాచరణ విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాల్దీవుల్లో సంక్షోభంతో భారత్, చైనాపై ప్రభావం హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఇండియాను కలవరపెడుతోంది. ఇటీవలే మాల్దీవులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న మరో ఆసియా దిగ్గజం చైనా కూడా తన వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. భారత నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మాల్దీవులతో 2011 వరకు భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 2012లో నాటి అధ్యక్షుడు నషీద్ ప్రభుత్వాన్ని పోలీసు, సైనిక తిరుగుబాటులో కూల్చివేసి అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడయ్యాక మాల్దీవుల్లో చైనా పలుకుబడి, వ్యాపారం విపరీతంగా పెరిగాయి. రాజధాని మాలేలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి భారత కంపెనీ జీఎంఆర్‌కు ఇచ్చిన కాంట్రాక్టును కూడా యమీన్ సర్కారు రద్దు చేసింది. మాల్దీవుల్లో 22 వేల మంది భారతీయులు లక్ష దీవులకు 700 కి.మీ. దూరంలోని ఈ చిన్న దేశం జనాభా నాలుగున్నర లక్షలు. ప్రస్తుతం 22 వేల మంది భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం 400 మంది వైద్యుల్లో 125 మందికి పైగా భారతీయులే. ఉపాధ్యాయుల్లో నాలుగో వంతు మంది కూడా ఇండియా నుంచి వెళ్లినవారే. దాదాపు అందరూ ముస్లింలే ఉన్న మాల్దీవుల్లో సంక్షోభం ముదిరితే అక్కడ మత ఛాందస వాదం, వాణిజ్య నౌకల దోపిడీ, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా పెరిగి తన భద్రతకు ముప్పువాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. భారత సరుకు రవాణా 97 శాతం ఈ ప్రాంతం మీదుగానే జరుగుతోంది. 1988లో మాల్దీవులను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి శ్రీలంక తీవ్రవాదుల ముఠా యత్నించినా భారత సైన్యం అండతో నాటి అధ్యక్షుడు గయూమ్ ఆ చర్యను తిప్పికొట్టారు. 2011లో చైనా పాదం మాల్దీవుల్లో చైనా రాయబార కార్యాలయాన్ని 2011లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ద్వీపదేశంతో చైనా వాణిజ్య సంబంధాలు వేగంగా వృద్ధి చెందాయి. సార్క్ దేశాల్లో పాకిస్తాన్ తర్వాత చైనాతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకున్న రెండో దేశం మాల్దీవులు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్టులో మాల్దీవులు కూడా భాగస్వామి. మాలే-హుల్‌హూల్ ద్వీపాల మధ్య వంతెన సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా సహాయంతో ఇక్కడ నిర్మిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర సిల్క్ రూట్ ప్రాజెక్టు నిర్మాణంలో మాల్దీవులది కీలకపాత్రగా చైనా భావిస్తోంది. శ్రీలంకలో హంబన్‌టోటా రేవు ప్రాజెక్టుతోపాటు జిబూటీలోనూ సైనిక స్థావరం నిర్మాణానికి స్థలం సంపాదించిన చైనా చెప్పుచేతల్లో నడిచే రాజ్యంగా మాల్దీవులు మారడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే.


శరణార్థులపై నిషేధం ఎత్తేసిన యూఎస్

11 దేశాల శరణార్థులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు అమెరికా జనవరి 30న ప్రకటించింది. అయితే ఆయా దేశాల నుంచి వచ్చే శరణార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఇరాన్, లిబియా, ఈజిప్ట్, మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా ఉన్నాయి.